telanagana
ఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
సూర్య, హుజురాబాద్:కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని, ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉందని హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు అన్నారు. మంగళవారం ఆయన హుజురాబాద్ ఆర్టీసీ బస్ డిపో వద్ద ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విశేషంగా కృషి చేస్తున్నారని, కార్మికులకు అందే ఫలాలను అందజేస్తున్నారని, అలాగే కార్మికుల హక్కుల కోసం నిరంతరం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు.కార్మికులకు, ప్రభుత్వానికి వారధిగా మంత్రి పొన్నం నిలుస్తున్నారని, విలీనం అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందని, పదేళ్లుగా చేయలేని పనులను కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసి చూపించమని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వానికి మద్దతుగా కార్మికులు నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొoటాల సుహాసిని, కౌన్సిలర్లు, ఐక్య కూటమి నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.