విజ్ఞాన భాండాగారంగా కలెక్టరేట్ గ్రంథాలయం
బాపట్ల,మేజర్‌న్యూస్:
కలెక్టరేట్ ఉద్యోగుల్లో పఠనాసక్తిని పెంపొందించి, విజ్ఞానాన్ని అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐఏఎస్ చొరవతో నూతన వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభంగా కలెక్టర్ ఐదు పుస్తకాలను బహుకరించి, ప్రతి ఉద్యోగి గ్రంథాలయానికి పుస్తకాలు అందించాలని పిలుపునిచ్చారు.
కలెక్టర్ పిలుపునకు స్పందించి జిల్లాలోని విద్యాశాఖ మండల స్థాయి అధికారులు 22 మంది పుస్తకాలను అందించారు. వారిలో యద్దనపూడి ఎంఈఓ గోపి 125 పుస్తకాలు బహుకరించారు. బాపట్ల పురపాలక కమిషనర్ ఎం. హాసిని, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఎ. సౌజన్య, డిప్యూటీ తహసీల్దార్ మేరీ సుధారాణి, కలెక్టరేట్ ఏ-సెక్షన్ సిబ్బంది, చీరాల డిప్యూటీ తహసీల్దార్ ప్రసన్న కూడా పుస్తకాలు అందించారు.
తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత రీడర్ డా. వి.వి. రాఘవమ్మ కలెక్టరేట్ గ్రంథాలయానికి విలువైన పుస్తకాలను విరాళంగా అందజేశారు. కలెక్టర్ వాటిని సాదరంగా స్వీకరించి, 82 ఏళ్ల వయసులోనూ జ్ఞానాన్ని పంచేందుకు ముందుకొచ్చిన రాఘవమ్మను అభినందించి, ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.
ఉద్యోగులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు కూడా గ్రంథాలయానికి పుస్తకాలు అందించేందుకు ముందుకొస్తున్నారు. కొందరు పుస్తకాల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధమవుతున్నారు. గురువారం ఒక్కరోజే 454 పుస్తకాలు అందగా, ఇప్పటివరకు మొత్తం 854 పుస్తకాలు సమకూరాయి. దాతల సహకారంతో కలెక్టరేట్ గ్రంథాలయం విజ్ఞాన భాండాగారంగా రూపుదిద్దుకుంటోంది