జుక్కల్‌లో భూ రీసర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్
పెద్దశంకరంపేట ; మండల పరిధిలోని జుక్కల్ గ్రామంలో కొనసాగుతున్న భూ రీసర్వే పనులను అదనపు కలెక్టర్ నగేష్ శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వే ప్రక్రియను పరిశీలించి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడిన అదనపు కలెక్టర్ వారి భూములకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఎల్‌పీఎం (ల్యాండ్ పార్సెల్ మ్యాప్) నంబర్ల ఆధారంగా ప్రతి రైతుకు చెందిన భూమి విస్తీర్ణాన్ని స్పష్టంగా తెలియజేయాలని అధికారులకు సూచించారు. రైతులకు తమ భూముల విస్తీర్ణం, సర్వే వివరాలపై పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు.
భూ రీసర్వే ప్రక్రియలో రైతులకు ఎలాంటి సందేహాలు, సమస్యలు ఉన్నా వాటిని తెలుసుకొని నివృత్తి చేయాలని సూచించారు. సర్వే పనుల్లో పారదర్శకత పాటిస్తూ, భూముల వివరాలు ఖచ్చితంగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. ఈయన వెంట తహసిల్దార్ నారాయణ ఉన్నారు.