విద్యార్థిని గాయపరచిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి. ఎమ్మెల్యే ఎమ్మెల్యే అమిలినేని.
కళ్యాణదుర్గం: రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని గోపికలక్ష్మిపై జరిగిన దాడి ఘటన అత్యంత అమానుషమని, ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన పాఠశాల ప్రాంగణంలో, అందులోనూ తరగతి గదిలో ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. విద్యార్థుల భద్రతకు పాఠశాలలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనతో బాధిత విద్యార్థిని కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైందని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. బాధిత కుటుంబం అధైర్యపడాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు, కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. విద్యార్థినిపై దాడికి పాల్పడిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఘటనకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులకు తగిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో విద్యార్థినుల భద్రతకు మరింత ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. పాఠశాలలు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు, వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యతను కూడా కలిగి ఉన్నాయని ఎమ్మెల్యే గుర్తుచేశారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ముఖ్యంగా బాలికల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదన్నారు. విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, బాధితురాలికి న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇటువంటి ఘటనల పట్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించాలని, విద్యార్థినులకు రక్షణ కల్పించే విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.