సచివాలయ ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌కు ఇక గ్రీన్ వాటర్! జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
హైదరాబాద్ మేజర్ న్యూస్ (సిటీ ప్రతినిధి):మంచినీటి వనరుల పరిరక్షణతో పాటు శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. జల సంరక్షణ, పర్యావరణహిత పట్టణ నిర్వహణ లక్ష్యంగా తెలంగాణ సచివాలయంలోని ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌లో పచ్చదనం నిర్వహణకు ఇకపై మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించనున్నారు.
ఈ వినూత్న కార్యక్రమం ద్వారా ప్రతిరోజూ సుమారు 1,50,000 లీటర్ల మంచినీటిని ఆదా చేయనున్నారు. ఇప్పటివరకు గార్డెన్ నిర్వహణకు వినియోగిస్తున్న మంచినీటికి బదులుగా ఎస్టీపీ శుద్ధి జలాలను వినియోగించడం ద్వారా విలువైన నీటి వనరులపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు, శుద్ధి చేసిన మురుగునీటిని సమర్థవంతంగా పునర్వినియోగంలోకి తీసుకురానున్నారు.
ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన గ్రీన్ వాటర్ ట్యాంకర్లను హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ (HMWSSB) మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి, ఐఏఎస్ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ ప్రాంగణాల్లో శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని విస్తరించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
గ్రీన్ ల్యాండ్స్ గెస్ట్‌హౌస్‌లోనూ అమలు
ఇదే తరహా విధానాన్ని బేగంపేటలోని గ్రీన్ ల్యాండ్స్ గెస్ట్‌హౌస్‌లో కూడా అమలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారిక నివాస ప్రాంగణంలోని ల్యాండ్‌స్కేప్ గార్డెన్ నిర్వహణకు ఎస్టీపీ ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగిస్తున్నారు. ఈ చర్య ద్వారా ప్రతిరోజూ మరో 30,000 లీటర్ల మంచినీటిని ఆదా చేస్తున్నారు.
రెండు ప్రాంగణాల్లో రోజుకు 1.80 లక్షల లీటర్ల ఆదా
సచివాలయం, గ్రీన్ ల్యాండ్స్ గెస్ట్‌హౌస్‌లలో చేపట్టిన ఈ కార్యక్రమాల ద్వారా కలిపి ప్రతిరోజూ సుమారు 1,80,000 లీటర్ల మంచినీటిని ఆదా చేయడం విశేషం. ఈ నీటిని ఇతర అవసరాలకు అందుబాటులో ఉంచే అవకాశం ఏర్పడుతుంది. శుద్ధి చేసిన మురుగునీటిని పచ్చదనం పెంపు, ఉద్యానవనాల నిర్వహణకు వినియోగించడం ద్వారా నీటి పునర్వినియోగానికి ఆచరణాత్మక నమూనాను అందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ డి. చక్రపాణి, హార్టికల్చర్ అధికారి వి.జి. సుందర్, ఎఫ్‌ఎస్‌ఓ సీతారాములు తదితర అధికారులు పాల్గొన్నారు.