కుటుంబ కలహాలతో వాటర్ ట్యాంక్ ఎక్కిన వివాహిత మానకొండూరులో కలకలం
సూర్య - మానకొండూర్ : కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైన ఓ వివాహిత న్యాయం చేయాలంటూ మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కి గంటపాటు నిరసన తెలిపిన ఘటన మండలంలోని వెల్ది గ్రామంలో సోమవారం తీవ్ర కలకలం రేపింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్ది గ్రామానికి చెందిన గూటం మల్లారెడ్డి భార్య అంజలి. మాట్లాడలేని స్థితిలో ఉండే (మూగ) ఆమె, కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైంది. తన అత్తగారి కుటుంబం, అలాగే తండ్రి ఎడ్ల కనక రెడ్డి కుటుంబాల మధ్య జరుగుతున్న కలహాలతో విసిగిపోయిన ఆమె, గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్ సమీపంలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కింది. తనకు న్యాయం చేయాలంటూ ట్యాంక్ పైనుంచే సైగలతో రోదిస్తూ నిరసన వ్యక్తం చేసింది.
విషయం గమనించిన ఆమె తండ్రి కనక రెడ్డి వెంటనే ట్యాంక్ పైకి ఎక్కి, కిందికి దిగిరావాలని కూతురిని ఎంత బతిమాలినా ఆమె వినలేదు. స్థానికుల సమాచారం మేరకు మానకొండూరు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్యాంక్‌పై ఉన్న అంజలితో మాట్లాడి, ఆమె సమస్యను పరిష్కరిస్తామని, న్యాయం చేస్తామని నచ్చజెప్పారు. పోలీసుల హామీతో ఆమె సురక్షితంగా కిందికి దిగి రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. గంటపాటు సాగిన ఈ నిరసన స్థానికంగా చర్చనీయాంశమైంది.