గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్ట్! ఐదేళ్లలో ఐదు కేసులు.. మూడు రాష్ట్రాల్లో నెట్‌వర్క్
సైబరాబాద్,మేజర్ న్యూస్ : గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్‌పై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన సచిన్ గంగారాం మరుతి చవాన్‌పై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు.
సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో నిందితుడు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భారీగా గంజాయిని సేకరించి వివిధ ప్రాంతాలకు తరలించేవాడు. తన అనుచరుల ద్వారా గంజాయిని డ్రగ్స్ వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకునేవాడు. ఈ క్రమంలో గంజాయి సేకరణ, రవాణా, విక్రయాల కోసం పలు రాష్ట్రాల్లో తన నెట్‌వర్క్‌ను విస్తరించుకున్నాడు.2020 నుంచి 2026 మధ్య నిందితుడిపై మొత్తం ఐదు గంజాయి అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి.
వీటిలో తెలంగాణలో మూడు, మహారాష్ట్రలో ఒకటి, కర్ణాటకలో మరొక కేసు ఉన్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ తన అనుచరుల ద్వారా గంజాయి సరఫరా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.నిందితుడి వరుస నేర కార్యకలాపాలు, అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా నెట్‌వర్క్ ప్రజారోగ్యానికి, ప్రజా శాంతిభద్రతలకు ముప్పుగా మారుతున్న నేపథ్యంలో కమిషనర్ పీడీ యాక్ట్ ప్రయోగానికి ఆదేశించారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ ద్వారా చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు.