ప్రశాంత్ నగర్ కాలనీ వాసులకు అండగా ఉంటా : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి,మేజర్ న్యూస్ : మియాపూర్ సర్వే నంబర్ 100 భూములపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రశాంత్ నగర్ కాలనీకి చెందిన నివాసితులు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా తాము ఈ కాలనీలో నివసిస్తున్నామని, ప్రభుత్వ శాఖలు ఇచ్చిన అనుమతులు, రికార్డులను నమ్మి జీవితకాల కష్టార్జితంతో ప్లాట్లు కొనుగోలు చేశామని తెలిపారు. ప్రభుత్వ అధికారుల తప్పిదం, రికార్డుల్లో జరిగిన అవకతవకలకు సామాన్య ప్రజలు బలికావాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే, నిజమైన కొనుగోలుదారులైన అమాయక కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం పరిహారం, ప్రత్యామ్నాయ స్థలాలు లేదా ఇతర న్యాయపరమైన పరిష్కార మార్గాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.కాలనీ వాసుల వినతిపై ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ న్యాయస్థానం తీర్పును గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అదే సమయంలో బాధిత కుటుంబాలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి , రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి, సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, కాలనీ వాసులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.