పలాసలో ప్రశాంతంగా పోలింగ్ - 70.13 శాతం నమోదు
.
67 కేంద్రాల్లో 34,660 ఓట్లు పోల్.. కలెక్టర్,ఎస్పీ పరిశీలన.
పలాస, నవంబర్ 1, మేజర్ న్యూస్.
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 67 పోలింగ్ కేంద్రాల్లో 49,420 ఓట్లకు గాను 34,660 ఓట్లు పోలయ్యాయి. దీంతో 70.13 శాతం పోలింగ్ నమోదైంది.ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా మొగిలిపాడు 1/1, 1/2, సూదికొండ 23/1 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5.40 వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సెల్ ఫోన్లను కూడా లోపలికి అనుమతించలేదు.
గంటల వారీగా పోలింగ్ శాతం.
ఉ. 9 గంటలకు - 13.41,ఉ. 11 గంటలకు - 25.98,మ. 1 గంటకు - 44.21,మ. 3 గంటలకు - 56.23,సా. 5 గంటలకు - 68.33,సా. 5.40 గంటలకు 70.13 శాతం నమోదు అయ్యింది.
అధికారుల పరిశీలన.
పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్,జిల్లా ఎన్నికల పరిశీలకులు మల్లవరపు సూర్యతేజ,జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పరిశీలించారు. చినబడాం పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకులు మల్లవరపు సూర్యతేజ, కాశీబుగ్గ కేంద్రాలను కలెక్టర్,ఎస్పీ, పరిశీలకులు కలిసి పరిశీలించారు. జిల్లా అదనపు ఎస్పీ వివేకానంద, కాశీబుగ్గ డీఎస్పీ జి.వి.రమణ ప్రతి కేంద్రాన్ని సందర్శించారు.
అభ్యర్థుల ఓటు.
పలాసలోని పోలింగ్ కేంద్రాలను చైర్మన్ అభ్యర్థులు వజ్జ గంగాభవాని, తాళాసు శ్రీపద్మ, స్వతంత్ర అభ్యర్థులు దువ్వాడ శ్రీజ, మన్యాల రమ్య సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. వీరు తమ వార్డుల్లో భర్తలతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి పలాస జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో తమ ఓటు వేశారు.