తెలుగుదేశం పార్టీలో చేరిన 50 వైకాపా కుటుంబాలు
- కొనసాగుతున్న వలసలు పరంపర
కోటబొమ్మాళి,నవంబర్ 1, మేజర్ న్యూస్:
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికల పరంపర నిరంతరాయంగా కొనసాగుతోంది. తాజాగా సంతబొమ్మాళి మండలం కస్పా నౌపడ గ్రామానికి చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలతో పాటు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి.
నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యమిస్తూ ముందుకెళ్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, సాగునీటి ప్రాజెక్టులు, రైతుల సంక్షేమం, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నట్లు తెలిపారు. టెక్కలి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, గౌరవం కల్పిస్తామని స్పష్టం చేశారు.