ఓటేసిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు -ఎన్డీఏపై నమ్మకంతో ప్రజల తీర్పు -వైసీపీ ఆరోపణలను ఖండించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.నరసింహ యాదవ్
ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ : తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి (తెలుగుదేశం, జనసేన, బీజేపీ) మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాసులు, 64 కార్పొరేటర్లకు ఓట్లు వేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్క ఓటరుకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి.నరసింహ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. తన నివాసం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్, ప్రధాని నరేంద్ర మోదీపై నమ్మకంతో, వారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పునిచ్చారు. ఫలితాలు అదే విధంగా ఉంటాయి. ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించడానికి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలన్నారు.
వైసిపి ఆరోపణలతో తగ్గిన ఓటింగ్ శాతం
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూటమి రిగ్గింగ్ కు పాల్పడ్డారని వైసిపి శ్రేణులు భయానక వాతావరణం సృష్టించిన నేపథ్యంలో కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం వల్లే ఓటింగ్ శాతం తగ్గిందని ఆయన ఆరోపించారు. తిరుపతిలో అనేక డివిజన్లలో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ చేసిందని కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. వైసీపీ అభ్యర్థులు భారీగా ఓటమి పాలవుతారని, తెలిసే కొన్ని డివిజన్లలో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించినందుకు తిరుపతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారం నుండి పోలింగ్ వరకు కష్టపడిన అభ్యర్థులు, మూడు పార్టీల నేతలు, క్లస్టర్లు, పోలింగ్ బూత్ ఏజెంట్లు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్