ఉయ్యూరు మున్సిపల్ కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
ఉయ్యూరు మేజర్ న్యూస్ : రెండవ సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా ఉయ్యూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉయ్యూరులోని ఏజీఎస్‌జీ సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, సిబ్బంది, సంబంధిత అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌంటింగ్ విధివిధానాలు, ఓట్ల లెక్కింపు దశలు, ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సిబ్బందికి వివరించారు. కౌంటింగ్ విధులకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ ఆర్‌ఓ హ్యాండ్‌బుక్‌లోని మార్గదర్శకాలను క్షుణ్ణంగా చదివి, నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. ఎలాంటి సందేహాలు, పొరపాట్లకు ఆస్కారం లేకుండా ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. శిక్షణలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో పాటు మాక్ కౌంటింగ్ నిర్వహించి సిబ్బందికి క్షేత్రస్థాయి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతి ఓటును కౌంటింగ్ ఏజెంట్లు, అబ్జర్వర్లు, రిటర్నింగ్ అధికారి పరిశీలించేలా నిబంధనల ప్రకారం చూపించిన అనంతరమే సంబంధిత టేబుల్‌పై ఉంచాలని, లెక్కింపు ప్రక్రియలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అనంతరం పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎన్నికల సామగ్రి పంపిణీని వేగవంతంగా, క్రమబద్ధంగా పూర్తి చేయాలని సూచించారు. సిబ్బంది ఎక్కువ సమయం వేచి ఉండకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల సామగ్రిని సక్రమంగా అందజేసి ఎలాంటి జాప్యం లేకుండా విధులకు పంపించాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి కౌంటింగ్ హాల్ వరకు ఏర్పాటు చేసిన మార్గం, బారికేడ్లు, ఫెన్సింగ్‌ను పరిశీలించి పటిష్ట భద్రత కల్పించాలని సూచించారు. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలన్నారు. ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్‌ను పరిశీలించి టేబుళ్లు, సిబ్బంది కూర్చునే ఏర్పాట్లు, ఫెన్సింగ్ తదితర సౌకర్యాలను సమీక్షించారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి ఫలితాల ప్రకటన వరకు ప్రతి దశను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం. సుభాష్ చంద్రబోస్, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ఎంపీడీవో, ఎన్నికల అధికారులు, కౌంటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.