విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
భూపాలపల్లి , మేజర్ న్యూస్, భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని చింతలపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా బుస్సా తిరుపతికి చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమై తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఇంట్లోని సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో భద్రపరిచిన రూ. 40 వేల నగదు పూర్తిగా కాలిపోయింది. అలాగే అగ్ని వేడికి సుమారు అర్ధ తులం బంగారం కరిగి బూడిదలో కలిసిపోయింది. అదే విధంగా సుమారు 10 తులాల వెండి పట్టీలు కూడా మంటల్లో కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇల్లు పూర్తిగా కాలిపోయి, బాధిత కుటుంబం కట్టుబట్టలతో మాత్రమే మిగిలిన దయనీయ పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. ప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆర్‌ఐ శివరామకృష్ణ, లైన్‌మెన్ అనిల్ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో తమ కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని, ప్రభుత్వం స్పందించి తక్షణమే ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని బాధితుడు బుస్సా తిరుపతి వేడుకున్నారు.
రిపోర్టర్, రవీందర్, భూపాలపల్లి జిల్లా