ఉద్యోగులకు రక్షణ కల్పించాలి -గత ఎన్నికల్లో సిబ్బందిపై దాడులు ఈసారి పునరావృతం కాకుండా చూడండి -డిఆర్ఓ కు ఏపీ జేఏసీ వినతి
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బందికి పూర్తి భద్రత కల్పించాలని, వయోభారం, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగులకు నిబంధనల ప్రకారం ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కల్పించాలని ఏపీ జేఏసీ తిరుపతి జిల్లా చైర్మన్ ఎస్.సురేష్ బాబు, సెక్రటరీ ఎస్.వెంకట ముని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులును కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత స్థానిక సంస్థల ఎన్నికలు, టౌన్ బ్యాంక్ ఎన్నికల సమయంలో సిబ్బంది ఎదుర్కొన్న ఇబ్బందులు, వారిపై జరిగిన దాడులను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల విధుల నుంచి మినహాయింపు
61 సంవత్సరాలు దాటిన ఉద్యోగులు, పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారు, కిడ్నీ మార్పిడి, గుండె శస్త్రచికిత్స, న్యూరో సర్జరీ చేయించుకున్నవారు, పక్షవాతం, క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, మానసిక వికలాంగత కలిగిన పిల్లల తల్లిదండ్రులకు నిబంధనల ప్రకారం మినహాయింపు ఇవ్వాలన్నారు.ప్రతి పోలింగ్ కేంద్రం లోపల, బయట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించాలని కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తగినంత పోలీసు సిబ్బందిని నియమించడంతోపాటు, ప్రతి పది పోలింగ్ కేంద్రాలకు ఒక పోలీసు పెట్రోలింగ్ బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిషేధాజ్ఞలను సమర్థవంతంగా అమలు చేసి, అనవసర గుంపులు గుమిగూడకుండా పర్యవేక్షించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద రాజకీయ నాయకులు, అనుచరుల అనధికార ప్రవేశాన్ని నియంత్రించాలి. పరిశీలన పేరుతో పోలింగ్ సిబ్బందిపై ఒత్తిడి చేయడం, దురుసుగా మాట్లాడడం, విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు భయాందోళనలకు గురికాకుండా, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తమ విధులను ప్రశాంతంగా నిర్వహించే వాతావరణం కల్పించడం అధికారుల బాధ్యతని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ముత్యాల రెడ్డి, గిరిబాబు, లలిత్, మధు, మధుసూదన్ పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్