telangana
అంగన్‌వాడిలో ఏడుగురే.. హాజరులో 14మంది - తనిఖీలో వెలుగుచూసిన వ్యత్యాసం
సూర్య మల్లాపూర్ ;;మండలంలోని కొత్తదామరాజ్‌పల్లి అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్ విధుల నిర్వహణ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రంలో ఏడుగురు చిన్నారులే కనిపించగా ఆన్లైన్ రికార్డుల్లో మాత్రం 14మంది హాజరైనట్లు నమోదు చేశారు. ఐసిడిఎస్ సూపర్‌వైజర్ శోభారాణి సోమవారం ఆకస్మిక తనిఖీ చేయగా వ్యత్యాసం వెలుగుచూసినట్లు తెలిసింది. అయితే సూపర్వైజర్ పర్యవేక్షణలో తేలిన ఈ తప్పుడు హాజరు గతంలో ఎన్నిసార్లు నమోదు చేసారనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా హాజరుకు తగ్గ ఆహరం ఏమవుతుందనేది స్పష్టత లేదు. మరోవైపు గర్భిణులు కూర్చోవాల్సిన గ్రీన్ టేబుల్ పై సామగ్రి ఉంచడంతో నిర్లక్ష్యానికి అద్దం పట్టినట్లైంది. ఇన్ని లోపాలు గుర్తించినప్పటికీ సూపర్వైజర్ చర్యలు తీసుకోకపోవడంతో అనుమానాలకు తావిచ్చినట్లైంది. చర్యలు లేని తనిఖీలు ఎందుకు? పర్యవేక్షణ ఫొటోలకే పరిమితమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.