telangana
తుంకిమెట్లలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం
బొంరాస్‌పేట్, మేజర్ న్యూస్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన పట్టభద్రులందరికీ ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో బొంరాస్‌పేట్ మండలంలోని తుంకిమెట్ల గ్రామంలో సోమవారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ బొంరాస్‌పేట్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం నిర్వహించి, ఓటరు నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు.ఈ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల్లో అర్హులైన పట్టభద్రులను గుర్తించి, వారు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని నాయకులు నిర్ణయించారు. గ్రామాల వారీగా ఓటరు నమోదు బాధ్యతలను పార్టీ నాయకులకు అప్పగించి, క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటు హక్కు కీలకమని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారం ఓటరుగా నమోదు చేసుకోవాలని నాయకులు పేర్కొన్నారు. ఓటరు నమోదు ప్రక్రియపై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించి, పట్టభద్రులకు అవసరమైన సమాచారం అందించాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగురావ్ దొర, మండల అధ్యక్షుడు ఉప్పరి జగదీశ్వర్ సాగర్, మాజీ మండల అధ్యక్షుడు సీహెచ్ నరసింహులు, ఎమ్మెల్సీ మండల ఇన్‌చార్జులు ముకుందం యాదవ్, రాజు నాయక్, ఏ. శ్రీనివాస్, అంజయ్య, నారాయణ గౌడ్, ఉప్పు జగదీశ్వర్, రాజారాం రెడ్డి, రఘు నాయక్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.