స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం ఖాయం
పాలకొల్లు మేజర్ న్యూస్ :కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల అన్ని వర్గాల ప్రజల్లో సంతృప్తి ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు ఏకపక్షంగా మద్దతు తెలుపుతుండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం పాలకొల్లు నియోజకవర్గంలోని తన స్వగ్రామం అగర్తిపాలెంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు భరోసా, భద్రత, నమ్మకం, విశ్వాసం ఉన్నాయని తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వెంటిలేటర్‌పైకి తీసుకువచ్చి వారసత్వంగా అప్పగించిందని విమర్శించారు. అయినప్పటికీ పరిపాలనా దక్షత కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, ఏడాదికి మూడు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అన్న క్యాంటీన్ల వంటి సంక్షేమ పథకాల అమలుతో ప్రజల్లో ప్రభుత్వంపై సంతృప్తి పెరిగిందన్నారు.
ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ అధికారంలోకి వస్తే రఫా రఫా అంటూ హింసను ప్రేరేపిస్తూ అరాచకాలకు పాల్పడుతుందనే భయాందోళనలు ప్రజల్లో ఉన్నాయని, అలాంటి రాజకీయాలకు స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తే కూటమి అభ్యర్థుల విజయం ఏకపక్షంగా కనిపిస్తోందన్నారు.
ఒకేసారి రెండు తుఫాన్లు విరుచుకుపడిన విపత్కర పరిస్థితుల్లో ముందస్తు చర్యలతో ప్రాణనష్టం జరగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా పరిస్థితులను ఎదుర్కొన్నారని మంత్రి తెలిపారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన వరి రైతులను ఆదుకునేందుకు హెక్టారుకు రూ.16 వేలుగా ఉన్న నష్టపరిహారాన్ని రూ.25 వేలకు పెంచి అందించనున్నట్లు వెల్లడించారు.
వరి పంటతో పాటు కొబ్బరి, అరటి తోటలు, ఇళ్ల నష్టంపై సమగ్ర అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మత్స్యకారులు, చేనేత కార్మిక కుటుంబాలకు 50 కిలోల బియ్యంతో పాటు ఐదు రకాల నిత్యావసర సరుకులను అందిస్తున్నామన్నారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన ఇతర వర్గాల కుటుంబాలకు కూడా 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు.