ఓటర్ల జాబితాల ప్రక్షాళనపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మవద్దు
ఏలూరు ఉమ్మడి ప.గో.జిల్లా సూర్య బ్యూరో : అర్హులైన ప్రతి భారత పౌరుడికి ఓటు హక్కును పరిరక్షిస్తూ, ఓటర్ల జాబితాలను పారదర్శకంగా, ప్రక్షాళన చేయడమే భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రధాన ఉద్దేశమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. సర్ ప్రక్రియపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం, అసత్య ఆరోపణలను తిప్పికొడుతూ ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం మేధావులు, విద్యావేత్తలు, వ్యాపారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో మంత్రి ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ సర్ అంటే అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు, మరణించినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన వారి పేర్లను నిబంధనల ప్రకారం సరిచేయడం మాత్రమేనని కేంద్రమంత్రి వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 21(3) ప్రకారం ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలు, బాధ్యతల్లో భాగంగానే ఈ ప్రక్రియ చేపడుతున్నారని, దీనికి రాజకీయ పార్టీగా బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తగిన నోటీసులు, అభ్యంతరాల స్వీకరణ, విచారణ వంటి ప్రక్రియలు లేకుండా ఎవరి ఓటును తొలగించే అవకాశం లేదన్నారు.
దేశంలో సర్ తరహా ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ కొత్తదేమీ కాదని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 12సార్లు ఈ ప్రక్రియ జరిగిందని, అందులో అత్యధికం గా 12 సార్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే నిర్వహించారని గుర్తుచేశారు. రెండు చోట్ల ఓట్లు నమోదు చేసుకోవడం సరైన విధానం కాదని, అలాంటి అక్రమ నమోదులను సరిచేయడాన్ని ఓట్ల తొలగింపుగా చిత్రీకరించడం సరికాదన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎదుగుతుండటాన్ని కొన్ని ప్రతిపక్ష శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉన్న భారత్ నేడు నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పేర్కొన్నారు. ఒకప్పుడు ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశంగా ఉన్న భారత్ నేడు రక్షణ రంగ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుందని వివరించారు. దేశ అభివృద్ధిని అడ్డుకోవడానికి, ప్రజల్లో అపోహలు సృష్టించడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న 13 కోట్ల ఓట్ల తొలగింపు ఆరోపణల్లో వాస్తవాలను ప్రజలు గమనించాలని ఆయన అన్నారు.
సర్ అమలైన రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను బట్టి ప్రతిపక్షాలు భిన్నమైన వాదనలు చేయడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. తమకు అనుకూలంగా ఫలితాలు వస్తే ఒకలా, ప్రతికూలంగా వస్తే మరోలా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియపై న్యాయస్థానాల్లో జరిగిన విచారణలు, వెలువడిన ఆదేశాలను కూడా ప్రజలు వాస్తవ దృక్పథంతో పరిశీలించాలని సూచించారు. ఓటర్ల జాబితాల ప్రక్షాళనలో ప్రజలు భాగస్వాములు కావాలని, సాకుల రాజకీయాలను, అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని కోరారు. బలమైన ప్రజాస్వామ్య సంస్థలు, ఐక్యమైన ప్రజల భాగస్వామ్యంతోనే వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించగలమని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. అంతకు ముందు సర్ ప్రక్రియపై మేధావులు, విద్యావేత్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకోగా సర్ కచ్చితంగా నిర్వహించవలసిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన అవగాహన బ్రోచర్‌ను కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ఆవిష్కరించారు.