ప్రపంచంలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఎక్స్‌పోకు హైదరాబాద్ వేదిక
సోమాజిగూడ / మేజర్ న్యూస్: అంతర్జాతీయ పౌల్ట్రీ రంగానికి హైదరాబాద్ మరోసారి వేదిక కానుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పౌల్ట్రీ ప్రదర్శనల్లో ఒకటిగా గుర్తింపు పొందిన 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో-2026 నవంబర్ 25 నుంచి 27 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. ఈ అంతర్జాతీయ ప్రదర్శనకు 120 దేశాల నుంచి 51 వేల మందికి పైగా పౌల్ట్రీ రంగ నిపుణులు, రైతులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రతినిధులు హాజరుకానున్నారు. 550కి పైగా సంస్థలు తమ ఉత్పత్తులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించనున్నాయి. ఈ ఎక్స్‌పో ద్వారా దేశీయ తయారీ రంగానికి ప్రోత్సాహం లభించడంతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానానికి ఆదరణ, అంతర్జాతీయ వ్యాపార భాగస్వామ్యాలకు అవకాశాలు ఏర్పడతాయని ఐపీఈఎంఏ-పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బాయస్ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్-2047 లక్ష్యాల సాధనలో ఈ ప్రదర్శన దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు
నవంబర్ 25, 26, 27 తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు ఎక్స్‌పో అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. ప్రపంచ పౌల్ట్రీ పరిశ్రమలోని సరికొత్త ఆవిష్కరణలు, వ్యాపార అవకాశాలు, ఆధునిక సాంకేతికతను ఒకే వేదికపై పరిచయం చేయనున్న ఈ ప్రదర్శన హైదరాబాద్ అంతర్జాతీయ పారిశ్రామిక ప్రాధాన్యతను మరింత పెంచనుంది.