పెద్దపంజాణి మండలంలో ప్రశాంతంగా పోలింగ్- 79.39 శాతం ఓటింగ్ నమోదు
మండల వ్యాప్తంగా ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మొత్తం 17 ఎంపీటీసీ స్థానాల పరిధిలోని 50 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో మొత్తం 79.39 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అత్యధిక సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. మండలంలో మొత్తం 45,284 ఓట్లు ఉండగా, అందులో 35,949 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో పురుషులు 17,715 మంది ఉండగా, మహిళలు 18,234 మంది తమ ఓటు వేశారు. పురుషుల కంటే 519 మంది మహిళలు అధికంగా ఓటు వేసి ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్నారు.
మండలంలోనే అత్యధికంగా పెద్దకాపల్లె ఎంపీటీసీ స్థానంలో 84.71 శాతం పోలింగ్ నమోదై అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కొగిలేరు (84.41%), చలమంగళం (84.22%), నాగిరెడ్డిపల్లె (83.99%), పెద్దపంజాని (83.28%), శివాది (83.19%) ఎంపీటీసీలు నిలిచాయి.రాయలపేట-2 ఎంపీటీసీ స్థానంలో అత్యల్పంగా 72.20 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. అలాగే అప్పినపల్లె (73.63%), రాజుపల్లె (74.07%) స్థానాల్లో సైతం ఓటింగ్ శాతం కాస్త తక్కువగా నమోదైంది.బట్టందొడ్డి ఎంపీటీసీ అత్యధికంగా 4,194 మంది ఓటర్లను కలిగి ఉండగా, ఇక్కడ 3,238 ఓట్లు (77.21%) పోలయ్యాయి. అత్యల్పంగా చామనేరు పరిధిలో 1,375 మంది ఓటర్లు ఉండగా 1,082 ఓట్లు (78.69%) పోలయ్యాయి.
మొత్తంమీద ఓటర్లు, ప్రత్యేకించి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో భద్రపరిచారు.
ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి రిపోర్టర్ పెద్దపంజాణి