విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీయడం అభినందనీయం:మార్కెట్ కమిటీ చైర్మన్ బి.ఎస్ ఆంజనేయులు ముదిరాజ్
కుల్కచర్ల, మేజర్ న్యూస్:విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీయడం అభినందనీయమని మార్కెట్ కమిటీ చైర్మన్ బి.ఎస్. ఆంజనేయులు ముదిరాజ్ అన్నారు. మండల పరిధిలోని ముజాహిద్‌పూర్ మోడల్ స్కూల్‌లో పీఎం శ్రీ ఇంటర్వెన్షన్, ఆర్ట్ అండ్ కల్చర్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పనికిరాని వస్తువులతో తయారు చేసిన పరికరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా వారి ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. పనికిరాని వస్తువులను ఉపయోగించి ఉపయోగకరమైన పరికరాలను తయారు చేయడం పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు కళలు, సృజనాత్మక కార్యక్రమాల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి హెప్సిబా, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.