మెదక్ జిల్లాను సంపూర్ణ కరువు జిల్లాగా ప్రకటించాలి..
కొల్చారం;మెదక్ జిల్లాను సంపూర్ణ కరువు జిల్లాగా ప్రకటించి, కరువు నివారణ చర్యల కోసం రూ.10 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ గురువారం కొల్చారం మండల తహసీల్దార్ శ్రీనివాస్ చారికి సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కోశాధికారి నరసమ్మ వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా నరసమ్మ మాట్లాడుతూ.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా మెదక్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించకపోవడం విచారకరమన్నారు. జిల్లాలో సుమారు 90 శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతులు, వ్యవసాయదారులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులు అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మనోహరాబాద్ మండలంలో ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారో వ్యవసాయ అధికారులు లెక్కలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాల్లో సాగు జరుగుతున్నప్పుడు కేవలం మనోహరాబాద్ మండలాన్ని మాత్రమే కరువు మండలంగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మెదక్ జిల్లాను సంపూర్ణ కరువు జిల్లాగా ప్రకటించాలని, రైతులకు తగిన న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కిష్టయ్య పాల్గొన్నారు