కుల్కచర్ల, మేజర్ న్యూస్:రానున్న కాలంలో ఎల్‌నినో ప్రభావంతో నీటి సంక్షోభం తలెత్తే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కుల్కచర్ల గ్రామ సర్పంచ్ వర్వాళ్ళ అంజిలయ్య సూచించారు. కుల్కచర్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వర్వాళ్ళ అంజిలయ్య అధ్యక్షతన వార్డు సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇంట్లో రోజువారీ నీటి వినియోగాన్ని తగ్గించుకోవడంతో పాటు వంటగది, వాష్‌బేసిన్ల నుంచి వచ్చే వృథా నీటిని మొక్కలకు, ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడం అత్యవసరమన్నారు. నీటి కొరత కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు, అడవుల్లో వన్యప్రాణులకు తాగునీరు అందక జీవవైవిధ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటి సంక్షోభాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే నీటి పొదుపుపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ విజయ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి భాస్కర్, వార్డు సభ్యులు మోత్కూర్ వెంకటేష్ కడుమూరి రాంరెడ్డి, జెల్ల నర్సింహులు, రాజమ్మ, గదే లక్ష్మి, నిరటి ఉత్తర, పుట్ట రాధిక, శివాని, జయమ్మ, సీసీ వెంకటయ్య, ఆశా వర్కర్లు స్వరూప, సునీత, జయమ్మ, మిషన్ భగీరథ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.