రైతు భరోసా నిధులు జమయ్యాయని ఫేక్ మెసేజ్‌లు
సూర్య జగిత్యాల ప్రతినిధి:రైతు భరోసా నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుతో ఫేక్ మెసేజ్‌లు రావడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని జగిత్యాల జిల్లా మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు.రైతుల ఖాతాల్లో నిజంగా డబ్బులు జమ కాకుండానే నిధులు జమ అయినట్లు సందేశాలు రావడంతో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారని, బ్యాంకులకు వెళ్లి ఖాతాలు పరిశీలించుకుంటే డబ్బులు లేక నిరాశతో వెనుదిరుగుతున్నారని పేర్కొన్నారు.అసలు ఈ ఫేక్ మెసేజ్‌లు రావడానికి కారణం ఏమిటి? ఇది సాంకేతిక లోపమా? ప్రభుత్వ సమాచార వ్యవస్థలో సమన్వయ లోపమా? అధికారుల నిర్లక్ష్యమా? లేక ప్రభుత్వ పర్యవేక్షణ వైఫల్యమా? అనే విషయాలను ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.