శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్
ఆలమూరు మేజర్ న్యూస్ :డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గురువారం ఆలమూరు మండలంలోని హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలమూరు ఎస్సై జి నరేష్ తెలియజేసిన వివరాల ప్రకారం మండలంలో జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించి, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తత తదితర అంశాలను సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ, ఓటర్లు ఎలాంటి ఒత్తిడి, భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించాలని తెలిపారు.
అలాగే ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే ఎన్నికల నిబంధనలు, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా ఎస్పీ వారి వెంట ఆలమూరు ఎస్సై జి నరేష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.