వర్షపు నీటిని లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు.
అనపర్తి, మేజర్ న్యూస్:స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌కు వర్షపు నీరు ఇబ్బందిగా మారినప్పటికీ ఓటర్లు మాత్రం వెనక్కి తగ్గలేదు. అనపర్తి మండలంలోని అనపర్తి గ్రామంలో గర్ల్స్ హైస్కూల్ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం బుధవారం కురిసిన భారీ వర్షానికి నీటితో నిండిపోయింది. వర్షం తగ్గినప్పటికీ పోలింగ్ కేంద్రం ప్రాంగణంలో నీరు నిలిచిపోవడంతో గురువారం ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే మార్గంలో నిలిచిన వర్షపు నీటిలో నుంచే నడుచుకుంటూ వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.నిలిచిన వర్షపు నీటిని బయటకు పంపించేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రయత్నాలు చేపట్టినప్పటికీ పూర్తిస్థాయిలో నీరు తొలగకపోవడంతో పరిస్థితి యథాతథంగా కొనసాగింది. దీంతో ఓటర్లు నీటిలో నుంచే పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు.అయినప్పటికీ ప్రజలు ఎలాంటి ఇబ్బందులనూ లెక్కచేయకుండా స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఓటర్లు చూపిన చొరవ స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.