telangana
స్పీకర్ సమక్షంలో 50 మంది అనుచరులతో కాంగ్రెస్‌లో చేరిన సర్పంచ్ వర్త్య మహిపాల్
మోమిన్‌పేట్, మేజర్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై రాళ్లగుడుపల్లి గ్రామ సర్పంచ్ వర్త్య మహిపాల్ తన 50 మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సర్పంచ్ వర్త్య మహిపాల్‌తో పాటు ఆయన అనుచరులకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా సర్పంచ్ వర్త్య మహిపాల్ మాట్లాడుతూ... బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలతో ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు.కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటూ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి రాళ్లగుడుపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, గ్రామస్తులు, సర్పంచ్ అనుచరులు తదితరులు పాల్గొన్నారు.