పాఠశాలల్లో అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణపై సర్పంచ్ పర్యవేక్షణ
కౌడిపల్లి;కౌడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణను గురువారం నాడు గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రం-1, ఎంపీపీఎస్ కౌడిపల్లి, బాలికల ఉన్నత పాఠశాల, ఎస్టీ గురుకుల మినీ పాఠశాలలను సందర్శించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ముఖ్యంగా కమ్యూనిటీ సోక్ పిట్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, పాఠశాలల పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై తగిన సూచనలు చేశారు. బాలికల ఉన్నత పాఠశాలలోని డైనింగ్ హాల్‌ను వినియోగంలోకి తీసుకురావాలని కోరుతూ ప్రధానోపాధ్యాయులు సర్పంచ్ కి వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సర్పంచ్ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలలకు సంబంధించిన ఇతర సమస్యలను కూడా గ్రామపంచాయతీ కార్యాలయం దృష్టికి తీసుకురావాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి రామారావు, వార్డు సభ్యురాలు చల్లా బొంతమ్మ , పంచాయతీ కార్యదర్శి నగేష్ కుమార్, పంచాయతీ సిబ్బంది ఎల్లం, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.