3 బిలియన్ డాలర్లకు నాన్-యుటిలిటీ వ్యాపార విక్రయం
సూర్య బిజినెస్ డెస్క్: అమెరికాకు చెందిన ప్రముఖ శక్తి సంస్థ డీటీఈ ఎనర్జీ (DTE Energy) తన వ్యాపార విధానంలో కీలక మార్పులు చేపట్టింది. తమ సంస్థకు చెందిన నాన్-యుటిలిటీ విభాగమైన 'డీటీఈ వాంటేజ్' (DTE Vantage) వ్యాపారాన్ని సుమారు 3 బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ జేపీ మోర్గాన్ అసెట్ మేనేజ్‌మెంట్ సలహా అందజేస్తున్న సంస్థాగత మదుపర్లకు ఈ వాటాలను విక్రయించనున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ ఒప్పందంలో భాగంగా ఈఎస్ కోక్ (EES Coke) మినహా మిగిలిన అన్ని డీటీఈ వాంటేజ్ ఆస్తులను కొనుగోలుదారులు చేజిక్కించుకోనున్నారు. భవిష్యత్తులో రెగ్యులేటెడ్ ఎలక్ట్రిక్ మరియు గ్యాస్ యుటిలిటీ రంగాలపై మరింత దృష్టి పెట్టాలని, ముఖ్యంగా పెరుగుతున్న డేటా సెంటర్ల విద్యుత్ డిమాండ్‌కు తగినట్లుగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని కంపెనీ ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ భారీ విక్రయ ప్రక్రియ వచ్చే ఏడాది (2027) ప్రథమార్థంలో పూర్తికానున్నట్లు కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి.
నాన్-యుటిలిటీ వ్యాపారాల నుంచి వైదొలగడం ద్వారా వచ్చే నిధులను ప్రధాన యుటిలిటీ ప్రాజెక్టుల విస్తరణకు మళ్లించాలని డీటీఈ ఎనర్జీ ప్రణాళిక రూపొందించింది. ఈ పరిణామం తమ సంస్థను దీర్ఘకాలిక వృద్ధి దిశగా నడిపించడంతో పాటు, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందిచడానికి దోహదపడుతుందని కంపెనీ ప్రధాన కార్యనిర్వాహక అధికారి పేర్కొన్నారు. ఈ తాజా ఒప్పందం గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో చర్చనీయాంశంగా మారగా, మదుపర్ల నుంచి కూడా సానుకూల స్పందన లభిస్తోంది.