నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు
కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరుగా నమోదుకు కావడానికి నవంబరు ఆరవ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గం ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి మరియు జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి తెలిపారు. ఒక్కరోజు మాత్రమే గడువు ఉందని, అర్హులైన ఉపాధ్యాయులు వెంటనే ఫారం-19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్ల జాబితాను కొత్తగా రూపొందించడం జరుగుతుందని, గతంలో ఓటర్లుగా నమోదైన ఉపాధ్యాయులు సైతం ప్రస్తుత ఎన్నికల కోసం కొత్తగా ఫారం-19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులు అందరూ గడువు ముగిసేలోగా దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.
గత ఎన్నికల సమయంలో 13,505 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు కాగా, ప్రస్తుత నమోదు ప్రక్రియలో ఇప్పటి వరకు 10,909 దరఖాస్తులు మాత్రమే అందాయని తెలిపారు. గత ఎన్నికల గణాంకాలతో పోలిస్తే ఇంకా సుమారు 2,600 మందికి పైగా అర్హులైన ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు కావాల్సి ఉందని పేర్కొన్నారు. అర్హులైన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ గడువు తేదీ, నవంబరు 6వ తేదీ లోగా ఫారం-19 ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.