తెలంగాణలో పచ్చిగుడ్ల మయోనైజ్‌పై ఏడాది పాటు పూర్తిస్థాయి నిషేధం
హైదరాబాద్ :
ప్రజ ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పచ్చిగుడ్లతో (Raw Eggs) తయారుచేసే మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ మరియు విక్రయాలపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తూ తెలంగాణ ఆహార భద్రతా కమిషనర్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం-2006 లోని సెక్షన్ 30(2)(ఎ) కింద ఈ నిషేధాజ్ఞలను విధించారు. ఈ నిషేధం 2026 అక్టోబర్ 30వ తేదీ నుంచి అమల్లోకి రాగా, ఏడాది పాటు అంటే 2027 అక్టోబర్ 29 వరకు అమలులో ఉంటుంది. దీనికి సంబంధించిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్ నవంబర్ 4న విడుదల చేశారు.
పచ్చిగుడ్లతో చేసే మయోనైజ్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో శవర్మా, మండి, బర్గర్లలో వాడే ఈ మయోనైజ్ నాణ్యతా ప్రమాణాల ప్రకారం నిల్వ చేయకపోవడం వల్ల సాల్మోనెల్లా (Salmonella) వంటి ప్రమాదకర బ్యాక్టీరియా చేరి వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
విక్రయదారులు ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఆహార భద్రతా చట్టం కింద కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే, పచ్చిగుడ్లు లేకుండా తయారుచేసే వెజిటేరియన్ మయోనైజ్ (Veg Mayonnaise) అలాగే పాశ్చరైజ్డ్ గుడ్లతో నిబంధనలకు లోబడి తయారుచేసే ప్రాసెస్డ్ మయోనైజ్‌ల వాడకానికి ఈ నిషేధం నుంచి మినహాయింపు ఉంటుంది.