సర్పంచ్ అభ్యర్థిగా సత్యవేణి ప్రజల ముందుకు.. అభివృద్ధికి అండగా ఉంటానన్న మాజీ ఎంపీటీసీ వీర వెంకటరావు
కడియం, మేజర్ న్యూస్ :గ్రామ పంచాయతీ మహిళా రిజర్వేషన్ నేపథ్యంలో కడియం మండలం దుళ్ళ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తన సతీమణి తోకల సత్యవేణిని ప్రజల ముందుకు తీసుకొస్తున్నట్లు మాజీ ఎంపీటీసీ తోకల వీర వెంకటరావు తెలిపారు. గతంలో ఎంపీటీసీగా ప్రజలకు సేవ చేసిన అనుభవంతో గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్‌గా సత్యవేణి బాధ్యతలు చేపట్టినా, ఒక గ్రామ బిడ్డగా తాను ఆమెకు అండగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గ్రామంలో రహదారులు, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సమస్యలను పరిష్కరించి దుళ్ళ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
గతంలో ఎంపీటీసీగా తనకు ప్రజలు అందించిన ఆదరణ, సహకారం మరువలేనివని పేర్కొంటూ.. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో తోకల సత్యవేణికి ప్రజలు ఆశీర్వాదం అందించాలని కోరారు. పదవులు తమకు అధికారం కాదని, ప్రజల గడప తొక్కి సేవ చేసే అవకాశమని అన్నారు.మన ఊరు.. మన అభివృద్ధి.. ఇదే తమ సంకల్పమని వీర వెంకటరావు పేర్కొన్నారు.