పలమనేరు మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకునేదెవరికో..? టిడిపి చరిత్ర తిరగరాస్తుందా.. వైసీపీ ఆధిపత్యం నిలబెట్టుకుంటుందా!
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేది ఎవరనే అంశంపై పట్టణంలో ఉత్కంఠ నెలకొంది. టీడీపీ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొనడంతో ఇరు పార్టీల నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థుల్లో గెలుపుపై తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. పలమనేరు మున్సిపాలిటీలోని 36 వార్డులకు గాను ఆరు వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 30 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అయితే పోలింగ్ శాతం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఓటరు నాడిని అంచనా వేయడం ఇరు పార్టీలకు కష్టంగా మారింది. కొన్ని వార్డుల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తమ ఆధిపత్యం కొనసాగుతుందనే ధీమాతో ఉండగా, టీడీపీ అభ్యర్థులు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తమ విజయానికి బాటలు వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ చైర్మన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి గౌడ్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా, వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి, క్యూడీఎస్ రాజేష్ దంపతులు సైతం విజయం తమదేనని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా, ఎస్‌వీసీఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు కోసం ఇరు పార్టీల అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం సాగిన ఈ పోరులో టీడీపీ కొత్త చరిత్ర సృష్టిస్తుందా? లేక వైఎస్సార్‌సీపీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుందా? అన్నది ఇప్పుడు పట్టణవ్యాప్తంగా ఆసక్తికర చర్చగా మారింది. మంగళవారం సాయంత్రం వెలువడనున్న ఫలితాలతో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్