ఎన్నికల విధుల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ
కె గంగవరం,మేజర్ న్యూస్ :కె. గంగవరం మండలంలో ఎన్నికల విధులకు నియమితులైన 67 మంది పోలింగ్ అధికారులు, 67 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు సోమవారం శిక్షణ తరగతులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్నికల విధుల నిర్వహణ,పోలింగ్ ప్రక్రియలో పాటించాల్సిన నియమ నిబంధనలు,తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సమగ్ర అవగాహన కల్పించారు.ఎన్నికలను ప్రశాంతంగా,నిష్పక్షపాతంగా,పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు పలు సూచనలు చేశారు.
ప్రతి ఓటరు ఎలాంటి ఒత్తిడికి,ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సూచించారు. బ్యాలెట్ పత్రాల నిర్వహణ, ఓటింగ్ విధానం,పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై వివరించారు.పోలింగ్ ప్రారంభానికి ముందే సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలని,పోలింగ్ సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలు,ఎన్నికల సామగ్రి వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రక్రియలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ విధులు నిర్వర్తించాలని సూచించారు.ఈ శిక్షణ కార్యక్రమానికి రిటర్నింగ్ అధికారి పి.శ్రీనివాసరావు,మండల అభివృద్ధి అధికారి ఎన్. శ్రీనివాసరావు హాజరై సిబ్బందికి మార్గదర్శనం చేశారు.కార్యక్రమంలో జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.మండలంలో 65 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు.మిగిలిన అర్హులైన సిబ్బంది కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.