బియ్యం అక్రమ వ్యాపారులపై 11 కేసులు నమోదు
25 కిలోల బస్తాపై 26 కిలోల ముద్ర..ధరల స్టిక్కర్లతోనూ మోసాలు
హైదరాబాద్, మేజర్ న్యూస్ ప్రతినిధి : బియ్యం అక్రమ నిల్వలు, అధిక ధరల విక్రయాలు, తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులపై పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రత్యేక బృందం, తూనికలు–కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా అక్టోబర్ 29 నుంచి 31వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని చిల్లర, టోకు వ్యాపార సంస్థలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొత్తం 18 వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకొని 11 కేసులు నమోదు చేశారు..తనిఖీల్లో పలు అక్రమాలు వెలుగుచూశాయి.
25 కిలోల బియ్యం బస్తాలపై 26 కిలోలుగా ముద్రించి వినియోగదారులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. కంపెనీలు ముద్రించిన అసలు ధరలపై అధిక ధరలతో కొత్త ధరల చీటీలు అంటించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వ్యాపార అనుమతులు, వస్తు సేవల పన్ను నమోదు, కార్మిక శాఖ అనుమతులు, ఆహార భద్రత లైసెన్సులు లేకుండానే కొందరు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, ఇతర మార్గాలకు తరలించడం వంటి ఉల్లంఘనలను కూడా గుర్తించారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సరూర్‌నగర్, జీడిమెట్ల, అల్వాల్ పోలీస్ స్టేషన్లలో 11 కేసులు నమోదు చేశారు. నిత్యావసర వస్తువుల చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నేర తీవ్రతను బట్టి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. వినియోగదారులకు నిత్యావసర సరుకులు సరైన ధరలకు, పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా నిరంతర తనిఖీలు కొనసాగిస్తామని, అక్రమాలకు పాల్పడే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.