రబీ 2026-27 సీజన్‌లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటలకు బీమా సౌకర్యం* *తక్కువ ప్రీమియంతో పంటలకు ఆర్థిక భద్రత – రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి* *కలెక్టరేట్‌లో పంటల బీమా పథకం పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి*
కర్నూలు, నవంబర్ 17: రబీ 2026-27 సీజన్‌కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) పంటల బీమా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సూచించారు.
మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రబీ 2026-27 సీజన్‌కు సంబంధించి కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులు తమ పంటలకు సంబంధించిన నిర్ణీత బీమా ప్రీమియాన్ని 2026 డిసెంబర్ 15వ తేదీలోగా చెల్లించి పంటల బీమా రక్షణ పొందాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అనుకోని కారణాలతో పంట నష్టం సంభవించినప్పుడు రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంలో పంటల బీమా కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అర్హులైన రైతులందరికీ ఈ పథకంపై విస్తృత అవగాహన కల్పించి, నిర్ణీత గడువులోగా నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పంటలకు బీమా రక్షణ కల్పించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా వివిధ పంటలకు ప్రభుత్వం నిర్ణయించిన బీమా ప్రీమియం వివరాలను కలెక్టర్ వెల్లడించారు.
*పంటల వారీగా బీమా ప్రీమియం వివరాలు:*
1. శనగలు: గ్రామస్థాయి బీమా యూనిట్ పరిధిలో ఎకరాకు రూ.420 ప్రీమియం చెల్లిస్తే రూ.28,000 వరకు బీమా వర్తిస్తుంది.
2. వరి: మండల స్థాయి బీమా యూనిట్ పరిధిలో ఎకరాకు రూ.630 ప్రీమియం చెల్లిస్తే రూ.42,000 వరకు బీమా వర్తిస్తుంది.
3. జొన్నలు: మండల స్థాయి బీమా యూనిట్ పరిధిలో ఎకరాకు రూ.297 ప్రీమియం చెల్లిస్తే రూ.19,800 వరకు బీమా వర్తిస్తుంది.
4. వేరుశనగ: మండల స్థాయి బీమా యూనిట్ పరిధిలో ఎకరాకు రూ.480 ప్రీమియం చెల్లిస్తే రూ.32,000 వరకు బీమా వర్తిస్తుంది.
5. ఉల్లి: జిల్లా స్థాయి బీమా యూనిట్ పరిధిలో ఎకరాకు రూ.1,350 ప్రీమియం చెల్లిస్తే రూ.45,000 వరకు బీమా వర్తిస్తుంది.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, పశువర్ధక శాఖ అధికారి డాక్టర్ రాజశేఖర్, జ్వాల ప్రాజెక్ట్ డైరెక్టర్ నరసింహారెడ్డి, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రావు, జడ్పీ సీఈవో సుధాకర్ రెడ్డి, టాటా ఎఐజి ఇన్సూరెన్స్ కంపెనీ కర్నూల్ డివిజన్ కోఆర్డినేటర్ కళ్యాణ్ పత్తికొండ కోఆర్డినేటర్ రవికుమార్, ఆదోని కోఆర్డినేటర్ సిద్ధరామప్ప, ఎమ్మిగనూరు కోఆర్డినేటర్ రవిచంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.