వృద్ధాప్య పింఛన్లు కూడా త్వరలో ఇవ్వాలి: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
వృద్ధాప్య పింఛన్లు కూడా త్వరలో ఇవ్వాలి: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్: పదేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న పేదల కల నెరవేరుతోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. దామెరలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి పాల్గొన్నారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీకి చెందిన 531 మంది, చౌటుప్పల్ మండలంలోని 970 మంది, నారాయణపూర్ మండలంలోని 917 మంది కలిపి మొత్తం 2,418 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందజేశారు. వీరిలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వృద్ధాప్య పింఛన్లు కూడా త్వరగా మంజూరు చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. పింఛన్ మొత్తాన్ని పెంచే విషయంలోనూ లబ్ధిదారుల తరఫున పోరాడతానని చెప్పారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.