గ్రంధాలయాల వారోత్సవాలులో వివిధ క్రీడా పోటీలు
ప్రొద్దుటూరు రూరల్ మేజర్ న్యూస్ : 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు మండలం హౌసింగ్ బోర్డులోని శాఖా గ్రంథాలయంలో విద్యార్థినీ విద్యార్థులకు ఉత్సాహంగా వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరుగు పందెం, మ్యూజికల్ చైర్స్, ఫ్రాగ్ రేస్ వంటి పోటీలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ పోటీల్లో మొదటి, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశంలో బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల్లో చదువుతోపాటు క్రీడాస్ఫూర్తి, శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. రిటైర్డ్ ఎంపీడీవో ఏ.వి. రమణారెడ్డి, కే.సి. ఓబుల్ రెడ్డి, బాలయ్య, ఎంపీటీసీ ఈశ్వర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు గురువి రెడ్డి, గ్రంథాలయ అధికారి భాస్కర్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.