ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలి
నెేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
ప్లాన్లకు అనుగుణంగా నిర్మాణాలు ఉంటేనే ఆయా భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుందని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. శ్రీనివాసనగర్, వెంకటేశ్వర నగర్ సహా పలు ప్రాంతాలలో భవనాల ప్లాన్ లను పరిశీలించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న భవన కొలతలను తనిఖీ చేశారు. నగరంలో జరిగే నిర్మాణాలకు నగరపాలక సంస్థ నుంచి అనుమతి తప్పనిసరి అని ఈ సందర్భంగా కమిషనర్ పేర్కొన్నారు. బహుళ అంతస్తు భవనాలు నిర్దేశిత ప్లాన్ ప్రకారం నిర్మిస్తేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. కనుక నూతనంగా నిర్మాణం చేసే భవనాలు తగిన డ్రైనేజి సిస్టం, గ్రీనరీ ఏర్పాటు చేసుకొని, నిబంధనల మేరకు చేపట్టాలన్నారు. అలాగే ప్లాన్‌కి విరుద్ధంగా నిర్మాణం జరిగే వాటికి నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సిటీ ప్లానర్ జి.వి.ఎస్.ఎన్.మూర్తి, ఏసీపీలు కొండలరావు, సుజాత, ఇతర టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉన్నారు.