జనగణన దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే కీలకమైన ప్రక్రియ-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
సూర్య, నంద్యాల బ్యూరో:జనగణన ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా, కచ్చితత్వంతో, నిర్ణీత మార్గదర్శకాల ప్రకారం నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదేశించారు. జనగణన ద్వారా సేకరించే సమాచారం రానున్న పదేళ్లలో దేశ అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ విధానాల రూపకల్పన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కీలక ప్రాతిపదికగా నిలుస్తుందని, ఈ బాధ్యతను ప్రతి అధికారి పూర్తి నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జనగణన కార్యకలాపాల నిర్వహణపై జిల్లా సెన్సస్ అధికారులు, డివిజనల్ సెన్సస్ అధికారులు, ఛార్జ్ ఆఫీసర్లు, వారికి సహాయకులుగా వ్యవహరించే డీఏఓలు, ఏఎస్ఓలకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ జనగణన ప్రక్రియ ప్రధానంగా రెండు దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ (HLO), రెండవ దశలో పాపులేషన్ ఎన్యుమరేషన్ ద్వారా జనాభా వివరాలను సేకరిస్తారని వివరించారు. మొదటి దశలో ప్రతి ఇంటిని, నివాస ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఎక్కడా ఎలాంటి ఖాళీలు లేకుండా వివరాలు నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఛార్జ్ ఆఫీసర్లు క్షేత్రస్థాయి కార్యకలాపాల్లో వ్యక్తిగతంగా భాగస్వాములై, తమ పరిధిలోని ప్రతి గ్రామం, ఆవాసం, అంతర్గత ప్రాంతం పూర్తిస్థాయిలో కవర్ అయ్యేలా పర్యవేక్షించాలన్నారు.
*జనగణనలో కచ్చితత్వానికి ప్రాధాన్యత*
జనగణనకు సంబంధించిన ప్రతి ప్రశ్న, ఉపప్రశ్నపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్ సూచించారు. గృహ నిర్మాణ పరిస్థితులు, నివాస సదుపాయాలు, వంటగది, తాగునీటి సౌకర్యం, విద్యుత్, పారిశుద్ధ్య సదుపాయాలు తదితర అంశాలతో కూడిన సుమారు 40 ప్రశ్నలకు సంబంధించి సరైన సమాచారాన్ని సేకరించాలన్నారు. ప్రశ్నావళిలోని ప్రతి అంశంపై సందేహాలను ముందుగానే నివృత్తి చేసుకొని, క్షేత్రస్థాయిలో తప్పులు దొర్లకుండా చూడాలని ఆదేశించారు. వలసల వివరాల నమోదు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎవరైనా కుటుంబ సభ్యులు వలస వెళ్లినట్లు నమోదు చేసేటప్పుడు కేవలం వలస వెళ్లారని పేర్కొనకుండా, వారు ఎక్కడికి వెళ్లారు, ఏ కారణంతో వెళ్లారు, ఏ విధమైన ఉపాధి కోసం వెళ్లారు, పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు తదితర పూర్తి వివరాలను సేకరించాలని సూచించారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా, పరస్పర అనుసంధానంతో నమోదు చేయాలని స్పష్టం చేశారు.
*సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి*
జనగణన ప్రక్రియను కంప్యూటరైజ్డ్ అప్లికేషన్ల ద్వారా నిర్వహిస్తున్నందున సంబంధిత సాఫ్ట్వేర్, డిజిటల్ విధానాలపై అధికారులు, సిబ్బంది పూర్తి పట్టు సాధించాలని కలెక్టర్ సూచించారు. జనాభా ప్రాతిపదికన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను తగిన సంఖ్యలో నియమించుకోవాలని, అవసరమైతే ప్రాంతాలను విభజించి బాధ్యతలు కేటాయించాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలు, బ్యాంకింగ్ కోచింగ్ కేంద్రాలతో సమన్వయం చేసుకొని అర్హులైన విద్యార్థుల సేవలను ఎన్యూమరేటర్లుగా వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ మార్గదర్శకాలకు అనుగుణంగా నియామకాలు, శిక్షణ, విధుల కేటాయింపు చేపట్టాలని సూచించారు.
*స్వీయ జనగణనపై విస్తృత అవగాహన కల్పించాలి*
స్వీయ జనగణన ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ప్రజలు స్వయంగా తమ కుటుంబ, గృహ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునే విధానంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ఇందుకోసం ప్రజలకు అవసరమైన అవగాహన కల్పించి, స్వీయ జనగణనలో భాగస్వాములు అయ్యేలా ప్రోత్సహించాలన్నారు. జనగణన కార్యకలాపాల కోసం మొత్తం బడ్జెట్లో సుమారు 40 శాతం నిధులు ఇప్పటికే విడుదల చేసినట్లు, మిగిలిన నిధులు సంబంధిత శాఖ ద్వారా నేరుగా జమ కానున్నట్లు వివరించారు. ఇప్పటికే విడుదలైన నిధులకు సంబంధించిన వినియోగ వివరాలను ఛార్జ్ ఆఫీసర్లు వెంటనే సమర్పించాలని సూచించారు.
*శిక్షణకు సమయపాలన తప్పనిసరి*
జనగణన శిక్షణా కార్యక్రమాలకు అధికారులు, సిబ్బంది నిర్దేశించిన సమయానికి తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. శిక్షణను సాధారణ కార్యక్రమంగా భావించకుండా, జనగణన విజయవంతానికి పునాదిగా గుర్తించాలని సూచించారు. జనవరి నుంచి మార్చి వరకు నిర్వహించనున్న జనగణన కార్యకలాపాలను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టి, ప్రతి దశను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జనగణన అనేది కేవలం ఒక వ్యక్తి, ఒక కార్యాలయం లేదా ఒక జిల్లాకు సంబంధించిన కార్యక్రమం కాదని, దేశంలోని సుమారు 147 కోట్ల ప్రజల జీవన పరిస్థితులు, సామాజిక, ఆర్థిక వివరాలను ప్రతిబింబించే జాతీయ స్థాయి ప్రక్రియ అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా సేకరించే సమాచారం రానున్న పదేళ్లపాటు దేశ అభివృద్ధి, వనరుల కేటాయింపు, ప్రజా సంక్షేమ పథకాల రూపకల్పనకు ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి అధికారి తన బాధ్యతను దేశాభివృద్ధిలో భాగస్వామ్యంగా భావించి, పూర్తి అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ శిక్షణా కార్యక్రమంలో శిక్షకులు ఎం. శ్రీనివాసరావు, జి. విష్ణు మాధురి, డి. సుస్మితతో పాటు రెవెన్యూ డివిజనల్ అధికారులు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా