ఎన్నికల నిబంధనలపై పోలీసుల అవగాహన వెల్దుర్తిలో మైక్ ఆటో ద్వారా ఓటర్లకు సూచనలు
వెల్దుర్తి, మేజర్ న్యూస్: ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద పాటించాల్సిన నిబంధనలపై వెల్దుర్తి మండల కేంద్రంలో పోలీసులు ప్రజలకు, ఓటర్లకు అవగాహన కల్పించారు. కేంద్ర సాయుధ బలగాలతో కలిసి పోలీసు అధికారులు ప్రధాన కూడలిలో మైక్ ఆటో ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మైక్ ద్వారా ఓటర్లకు పలు కీలక సూచనలు చేశారు:
పోలింగ్ కేంద్రాలకు నిర్ణీత పరిధిలో (100 మీటర్ల లోపల) ఎలాంటి ప్రచారం నిర్వహించరాదని, ఓట్లు వేయమని ఎవరినీ అడగరాదని స్పష్టం చేశారు.ప్రతి పోలింగ్ బూత్ వద్ద సీసీ కెమెరాల నిఘా ఉంటుందని, అక్కడ జరిగే ప్రతి కదలిక రికార్డు అవుతుందని హెచ్చరించారు.ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా నిలబడకుండా నేరుగా ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు.నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మండల ప్రజలందరూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సైలు, పోలీసు సిబ్బంది, కేంద్ర బలగాలు పాల్గొన్నారు.