గ్యాస్ లీకేజీపై ఆందోళన వద్దు....
గ్యాస్ లీకేజీపై ఆందోళన వద్దు.... నియంత్రణ చర్యలు ముమ్మరం జిల్లా కలెక్టర్....
అమలాపురం మేజర్ న్యూస్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం తాడివారిమెరక గ్రామంలో చోటుచేసుకున్న ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీ ఘటనపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
గ్యాస్ లీకేజీ తీవ్రత, నియంత్రణ చర్యలపై ఓఎన్జీసీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
గ్యాస్ లీకేజీని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఓఎన్జీసీ అధికారులకు స్పష్టం చేశారు. పోలీసు, అగ్నిమాపక శాఖల సిబ్బంది ఘటనా స్థలంలో అప్రమత్తంగా ఉంటూ రక్షణ చర్యలు చేపడుతున్నారు.
గ్యాస్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు, ఎలాంటి ఎలక్ట్రికల్ పరికరాలు వినియోగించరాదని, నిప్పు లేదా మంటలు వెలిగించరాదని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, గ్యాస్ లీకేజీ ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
గ్యాస్ లీకేజీ పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అన్ని శాఖల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. రంబాల నాగసత్య నారాయణ అమలాపురం మేజర్ న్యూస్