విద్యార్థులకు కంటి పరీక్షలు.. 19 మందికి అద్దాల కోసం సిఫార్సు
ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:
జిల్లా అంధత్వ నివారణ సంఘం ఆధ్వర్యంలో పాఠశాల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు పట్టణంలోని 2వ వార్డు మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు తేజా పాల్గొని మొత్తం 296 మంది విద్యార్థినీ, విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 19 మందికి కంటి చూపు సమస్యలు ఉన్నట్లు గుర్తించి, కంటి అద్దాల కోసం సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా కంటి వైద్య నిపుణులు తేజా మాట్లాడుతూ.. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నట్లుగా మనిషి జీవితంలో కంటి చూపు ఎంతో విలువైనదని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎక్కువసేపు సెల్‌ఫోన్లు, టీవీలు చూడకుండా ఉండాలని, చదివేటప్పుడు సరైన వెలుతురు ఉండేలా చూసుకోవాలని, కళ్లకు ఇబ్బంది కలిగినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని వివరించారు. కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా భవిష్యత్తులో చూపు సంబంధిత ఇబ్బందులను నివారించవచ్చన్నారు. పాఠశాల స్థాయిలో ఇలాంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఉన్న ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన వైద్యసేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత, సీఓ ఎంవీ సుబ్బారెడ్డి, హెల్త్ సెక్రటరీ రెబక, హెల్త్ అసిస్టెంట్ రామకృష్ణ, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు
రిపోర్టర్: ప్రతాప్, ప్రొద్దుటూరు