ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల భారీ ధర్నా
పుల్కల్:; నెల రోజులుగా వరి కోతలు కోసి, కల్లాల్లో ధాన్యాన్ని ఆరబోసి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్న రైతులు ఆందోళన బాట పట్టారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో రైతులు భారీ ధర్నా నిర్వహించారు.గత నెల రోజులుగా వరి ధాన్యాన్ని కల్లాల్లోనే నిల్వ ఉంచుకోవాల్సి వస్తోందని, అకాల వర్షాలు, ఇతర ఇబ్బందులతో ధాన్యం దెబ్బతింటుందనే ఆందోళన రైతుల్లో నెలకొందని తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ తమ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో రైతులు పుల్కల్ మండల కేంద్రంలో ధర్నాకు దిగారు. ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని, కల్లాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.విషయం తెలుసుకున్న తహసీల్దార్ కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. మధ్యాహ్నం లోపు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.అధికారులు ఇచ్చిన హామీ మేరకు ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతాయా? లేక రైతులకు మళ్లీ ఎదురుచూపులే మిగులుతాయా? అనేది వేచి చూడాల్సి ఉంది.