రాజన్న ఆలయ గోపురాన్ని ముట్టుకుంటే సహించం: భాజపా
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా ప్రధాన ఆలయ గోపురాన్ని కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని ఆరోపిస్తూ భాజపా నాయకులు మంగళవారం ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం ఎదుట ధర్నాకు దిగారు. ఆలయ అభివృద్ధి పనుల సమయంలో ప్రధాన గోపురానికి ఎలాంటి నష్టం కలిగించబోమని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాన గోపురాన్ని ముట్టుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ధర్నా నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఆలయ పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.