telangana
జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను ప్రారంభించిన ఎంపీ గోడం నగేష్, కలెక్టర్ రాజర్షి షా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ఆదిలాబాద్ యువతలో దాగి ఉన్న సృజనాత్మకత, కళా నైపుణ్యాలను వెలికితీసేందుకు యువజన ఉత్సవాలు ఎంతగానో దోహదపడతాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎంపీ గోడం నగేష్ పిలుపునిచ్చారు.బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను ఎంపీ గోడం నగేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, జిల్లా కలెక్టర్ రాజర్షి షా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ.. యువత పోటీతత్వాన్ని అలవర్చుకుని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, నృత్యాలకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉందని, పురాతన దేవాలయాల్లోని శిల్పకళలోనూ మన పూర్వీకుల కళా వైభవం, నృత్యరీతులు ప్రతిబింబిస్తాయని వివరించారు. గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు.పోటీల్లో పాల్గొనేటప్పుడు అందుబాటులో ఉన్న సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని తమలోని ప్రతిభను సంపూర్ణంగా ప్రదర్శించాలని సూచించారు. 1998లో ఆదిలాబాద్‌లో జాతీయ స్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ప్రస్తుత ఉత్సవాల్లో పాల్గొంటున్న యువతీయువకులు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిల వరకు విజేతలుగా నిలిచి అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు.జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. యువతలోని ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించడంతోపాటు వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు యువజన ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీధి నాటకాలు, జానపద గీతాలు, నృత్యాలు, వ్యాసరచన, చిత్రలేఖనం, కవితా రచన తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన వారికి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.బాలికలు వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని, బాలురు సైతం అన్ని రంగాల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శించాలని సూచించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని అన్నారు. యువత నైపుణ్యాభివృద్ధికి స్టెప్ ద్వారా అవసరమైన శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నామని తెలిపారు.అనంతరం యువతీయువకులు ప్రదర్శించిన వివిధ కళారూపాలు, నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో సీఈఓ స్టెప్ సతీష్, పోటీల న్యాయ నిర్ణేతలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, యువతీయువకులు తదితరులు పాల్గొన్నారు.