*6 నెలల్లో సమీకృత పశు వసతి కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలి* *పశుసంపద అభివృద్ధి, మహిళా సాధికారతే లక్ష్యంగా సమీకృత పశుసంవర్ధక కేంద్రాల ఏర్పాటు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*
కర్నూలు, నవంబర్ 17:- జిల్లాలో సమీకృత పశు వసతి కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి 6 నెలల్లో పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు..
మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో సమీకృత పశు వసతి కేంద్రాల ఏర్పాటుపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమీకృత పశు వసతి కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కర్నూలు, పత్తికొండ, ఆదోని ఆర్డీఓ లను ఆదేశించారు.. తడకనపల్లి సమీపంలో ఇప్పటికే పశు వసతి కేంద్రం అందుబాటులో ఉన్నందున, కర్నూలు అర్బన్ మినహా మిగిలిన 6 నియోజకవర్గాల్లో ఈ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్డీఓ లను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో నీటి వసతి అందుబాటులో ఉన్న గ్రామానికి సమీపంలో 5 నుంచి 6 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని కలెక్టర్ తెలిపారు. పశువుల పెంపకానికి అవసరమైన నీటి సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని, బోర్‌వెల్ లేదా సమీపంలోని నది, వాగు, వంక వంటి నీటి వనరులు ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.. నవంబర్ 30వ తేదీలోగా స్థలాల గుర్తింపును పూర్తి చేసి, సంబంధిత ప్రతిపాదనలను సమర్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి సుమారు రూ.10 లక్షల అంచనా వ్యయంతో వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ పథకం కింద అవసరమైన పనులను చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఒక్కో పశువుల షెడ్డులో సుమారు 24 పశువులకు సరిపడేలా వసతులు కల్పించాలని, పశువులకు నిరంతర నీటి సరఫరా కోసం వాటర్ ట్యాంకులు, మేత సాగుకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.. పశువులకు మేత అందించడం, పాలు పితకడం, పేడ నిర్వహణ, పాల మార్కెటింగ్ వంటి కార్యకలాపాలను స్వయం సహాయక సంఘాల గ్రూపుల ద్వారా నిర్వహించాలని కలెక్టర్ డిఆర్డిఏ పిడి ని ఆదేశించారు. కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేసేందుకు మండల, గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పాల ఉత్పత్తిని పెంచడం, మార్కెట్ సదుపాయాలను మెరుగుపరచడం, పశువుల పేడ నిర్వహణ, సర్క్యులర్ ఎకానమీ విధానాలను ప్రోత్సహించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఎస్‌హెచ్‌జీలు, ఎఫ్‌పీఓల ద్వారా మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అదే విధంగా పశుగ్రాస భద్రతను మెరుగుపరచడం, పశువుల ఆరోగ్య సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు..
సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, పశు సంవర్థక శాఖ అధికారి డా.రాజశేఖర్, డ్వామా పిడి నరసింహా రెడ్డి, డిఆర్డిఏ పిడి శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.