ధారూర్‌లో చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ
ధారూర్, మేజర్ న్యూస్: ధారూర్ మండల కేంద్రంలోని ఎస్.ఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధారూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు కొత్త పెన్షన్ మంజూరు పత్రాలను ఆయన అందజేశారు.ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో కొత్త పెన్షన్లు రావడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని, కానీ ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు మంజూరు చేస్తోందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడా ఆపకుండా కొనసాగిస్తున్నారని చెప్పారు.ఇప్పటివరకు వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సుమారు రూ. 1000 కోట్ల వరకు నిధులు మంజూరయ్యాయని స్పీకర్ వెల్లడించారు. రాబోయే ఏడాది కాలంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో రోడ్లు మరియు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం 'ఇందిరమ్మ కుటుంబ బీమా' పథకాన్ని కూడా అమలు చేయబోతోందని ఆయన తెలియజేశారు.అలాగే, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ తప్పకుండా ఇండ్లు మంజూరవుతాయని స్పష్టం చేశారు. రేషన్ కార్డులు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని, వారందరికీ కార్డులు అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం 'ఎల్ నినో' ప్రభావం ఉన్నందున రైతులు, ప్రజలు నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వాడుకుంటూ ప్రభుత్వానికి సహకరించాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ సుధీర్ కుమార్, మాజీ జెడ్పీటీసీ రాములు, మాజీ ఎంపీపీ హన్మంత్ రెడ్డి, ధారూర్ మండల నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.