అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్.. అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
మర్పల్లి, మేజర్ న్యూస్: అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించి అండగా నిలుస్తామని తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం మర్పల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. పెన్షన్ పొందడం అనేది ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న లబ్ధిదారుల కల అని, గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల కోసం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తున్నామని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ పథకాల కోసం ప్రతిరోజూ 18 గంటల పాటు నిర్విరామంగా కష్టపడుతున్నారని తెలిపారు.ప్రజా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తోందన్నారు. గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఎక్కడా నిలిపివేయకుండా ప్రజలకు సేవలందిస్తోందని చెప్పారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారని వివరించారు.వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇప్పటికే సుమారు రూ.1,000 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అన్ని గ్రామాలకు, మండలాలకు మెరుగైన రహదారులతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో చర్చించి మరిన్ని నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు.రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేశామని, రైతులకు అందాల్సిన సబ్సిడీలను కూడా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో గత ప్రభుత్వం ప్రజలకు ఆశలు కల్పించిందని, ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తోందని తెలిపారు. సొంత స్థలం లేని పేదలకు గ్రామాల్లోని ప్రభుత్వ స్థలాల్లోనే ఇళ్లు నిర్మించి ఇచ్చేలా అధికారులతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ నెల 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నారని, కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా అందించడం ఈ పథకం ప్రత్యేకత అని వివరించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నరసింహారెడ్డి, తహసీల్దార్ మనోజ్ చక్రవర్తి, ఎంపీడీఓ శాంతమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ జి. మల్లేష్ యాదవ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎం. కృష్ణారెడ్డి, మాజీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ వి. రవీందర్, మండల సర్పంచుల అధ్యక్షుడు ఎండీ రఫీ, మర్పల్లి సర్పంచ్ రమేష్ వర్మ, లైబ్రరీ మాజీ చైర్మన్ ఎస్. కొండల్ రెడ్డి, సీనియర్ నాయకులు జి. రాములు యాదవ్, జి. సుభాష్ యాదవ్, శంకరయ్య గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, సర్పంచులు, గ్రామస్తులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.