నాలుగు దశాబ్దాల విధేయత.. నేడు వారసుడిగా సర్పంచ్ బరిలోకి!
తెదేపా బలోపేతానికి బొమ్మన శివశంకర్ రెడ్డి విశేష కృషి
తండ్రి ఆశయాలతో ఎన్నికల క్షేత్రంలోకి తనయుడు రమాకాంత్ రెడ్డి
ఆశీర్వదించాలని వెల్దుర్తి గ్రామస్థులకు కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
వెల్దుర్తి, రూలర్ న్యూస్:రాజకీయాల్లో పదవులు ఆశించకుండా, కేవలం సిద్ధాంత బలం, ప్రజాసేవే లక్ష్యంగా నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు బొమ్మన శివశంకర్ రెడ్డి. తాజాగా వెల్దుర్తి గ్రామ సర్పంచ్ స్థానం జనరల్ (ఓసీ) కేటగిరీకి రిజర్వ్ కావడంతో, ఆయన తనయుడు రమాకాంత్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తండ్రి అందించిన సేవలను గుర్తించి, గ్రామాభివృద్ధి కోసం తనయుడిని ఆశీర్వదించాలని కుటుంబ సభ్యులు గ్రామస్థులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
కష్టకాలంలో పార్టీకి అండగా..
1983లో తెదేపా ఆవిర్భావం నుంచి (1992-94 మధ్య కాలం మినహా) శివశంకర్ రెడ్డి పార్టీ జెండాను భుజాన మోస్తున్నారు. గతంలో సింగిల్ విండో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై రెండు దశాబ్దాల పాటు రైతులకు సేవలందించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సైతం వ్యక్తిగత పదవుల కోసం పాకులాడకుండా గ్రామ ప్రయోజనాలకే పెద్దపీట వేశారు. ముఖ్యంగా 2019–2024 మధ్య తెదేపా ప్రతిపక్షంలో ఉన్న క్లిష్ట సమయంలో వెల్దుర్తిలో పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతూ, కార్యక్రమాలను ముందుండి నడిపించారు.
అందరివాడిగా గుర్తింపు
రాజకీయ ప్రత్యర్థులను సైతం చిరునవ్వుతో పలకరించే సంస్కారం ఆయన సొంతమని గ్రామస్థులు చెబుతుంటారు. మండల స్థాయిలో ఎందరో నాయకులు ఎదగడానికి ఆయన ప్రోత్సాహం అందించారు. ఇప్పుడు తండ్రి రాజకీయ వారసత్వాన్ని, ప్రజాసేవా దృక్పథాన్ని పుణికిపుచ్చుకున్న రమాకాంత్ రెడ్డి వెల్దుర్తి సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రజల ముందుకు వస్తున్నారు. నాలుగు దశాబ్దాల పాటు తమ కుటుంబం పార్టీకి, గ్రామానికి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని రమాకాంత్ రెడ్డికి అవకాశం కల్పించాలని కుటుంబ సభ్యులు, అనుచరులు కోరుతున్నారు